బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి గుండ్ బ్రత్ వద్ద ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా భారత ఆర్మీపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమయిన సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరగ్గా.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది ముదాసిర్ పండిట్ సహా ముగ్గురు హతమైనట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. సోపోర్‌లోని గుండ్ బ్రత్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ వివరాలను కశ్మీర్ ఐజీపీ ట్విట్టర్‌లో తెలిపారు. సోపోర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది ముదాసిర్ పండిట్‌ను మట్టుబెట్టినట్టు కూడా చెప్పారు.