దాతృత్వంలో ప్రపంచంలోనే నంబర్‌ 1 జమ్‌షడ్జీ టాటా. - Asthram News


ముంబయి: గత శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వశీలి భారత పారిశ్రామిక పితామహుడు జెమ్‌షెడ్జీ టాటాయేనని ఒక నివేదిక వెల్లడించింది. జెమ్‌షెడ్జీ మొత్తం 102 బిలియన్‌ డాలర్ల (ఇప్పటి మారకపు విలువ ప్రకారం రూ.7.65 లక్షల కోట్ల)ను వితరణ చేసినట్లు హూరన్‌, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌లు రూపొందించిన అగ్రగామి-50 మంది దాతల జాబితా చెబుతోంది. టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడైన జెమ్‌షెడ్జీ తర్వాత బిల్‌ గేట్స్‌ 74.6 బిలియన్‌ డాలర్ల వితరణతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. వారెన్‌ బఫెట్‌ (37.4 బి. డాలర్లు), జార్జ్‌ సోరోస్‌(34.8 బి. డాలర్లు), జాన్‌ డి రాక్‌ఫెల్లర్‌(26.8 బి. డాలర్లు)లు తరవాతి స్థానాల్లో ఉన్నారు. ‘అమెరికా, ఐరోపా వితరణశీలురు గత శతాబ్దకాలంగా దాతృత్వపు ఆలోచనల్లో ఆధిపత్యం చూపించినప్పటికీ.. ప్రపంచంలోనే ఎక్కువమొత్తం దానం చేసిన వారిగా భారత్‌కు చెందిన టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్జీ టాటా అవతరించారని హూరన్‌ ఛైర్మన్‌, చీఫ్‌ రీసెర్చర్‌ రూపర్ట్‌ హూగ్‌వెర్ఫ్‌ పేర్కొన్నారు. తన సంపదలో మూడింట రెండొంతుల వాటాను ట్రస్టులకు కేటాయించడం ద్వారా విద్య, ఆరోగ్యం వంటి పలు రంగాల సంక్షేమానికి టాటాలు పాటు పడినట్లు గుర్తు చేశారు. 1892 నుంచే జెమ్‌షెడ్జీ టాటా వితరణలు మొదలైనట్లు తెలిపారు.


భారత్‌ నుంచి ప్రేమ్‌జీ సైతం

* టాటా కాకుండా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో విప్రోకు చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ(22 బి. డాలర్లు) ఒక్కరే ఉన్నారు.
* జాబితాలో 38 మంది అమెరికా నుంచే ఉండగా.. బ్రిటన్‌ నుంచి అయిదుగురు, చైనా నుంచి ముగ్గురు ఉన్నారు.
* ఈ జాబితాలోని 50 మంది దాతల్లో 37 మంది పరమపదించారు. ఈ 50 మంది కలిపి గత శతాబ్ద కాలంలో 832 బిలియన్‌ డాలర్లను సమాజానికి ఇచ్చారు.
* వీరి దానం వల్ల ఏటా అందే గ్రాంట్లు 30 బి.డాలర్లుగా ఉన్నాయని హూరన్‌ తెలిపింది. వార్షిక గ్రాంట్ల లో 8.5 బి. డాలర్లతో మెకంజీస్కాట్‌ అగ్రస్థానంలో ఉన్నారు.

ఈనాడు సౌజన్యంతో
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS