విభూ.. నీవు వదిలి వెళ్లిన దారిలో నేను ప్రయాణం మొదలు పెడుతున్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు అనిపిస్తోంది. ‘సాధించావ్..’ అని నాకు చెబుతున్నట్లుగా అన్పిస్తోంది’’.. ఆర్మీ కమాండ్ చీఫ్ తన భుజంపై నక్షత్రాలను పెడుతున్నప్పుడు లెఫ్టినెంట్ నిఖితా కౌల్ అంతరంగమిది. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన భర్తను నాడు సగర్వంగా సాగనంపి.. ఇప్పుడు ఆయన వారసురాలిగా సైన్యంలో చేరారు. శనివారం చెన్నైలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో పుల్వామా అమరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖిత.. శనివారం ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు.
2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ విభూతి శంకర్ అమరులయ్యారు. అప్పటికి ఆయనకు వివాహమై తొమ్మిది నెలలే అయింది. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. కానీ ఆమె మాత్రం జాలి కాదు.. గర్వపడమని చెప్పారు. అంతేకాదు.. భర్త మీద ప్రేమతో ఆయన బాధ్యతను కూడా పంచుకున్నారు. దిల్లీలో ఎంఎన్‌సీ ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. తన భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలోనే సీటు సాధించి శిక్షణ తీసుకున్నారు. నేడు లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా తన భర్తను గుర్తుచేసుకుంటూ.. ‘‘నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఐ లవ్ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అని ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు