ఆనందయ్య మందుపై సోమవారం తుది నిర్ణయం... ఆయుష్ కమిషనర్ రాములు. - Asthram News

అమరావతి: ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పారు. కొవిడ్‌ కట్టడి చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆనందయ్య ఔషధం పైనా సీఎం చర్చించినట్టు రాములు తెలిపారు. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుంది. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుంది. సీసీఆర్‌ఏఎస్‌ అధ్యయన నివేదిక రేపు వచ్చే అవకాశం ఉంది. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం. కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకు విచారణ నివేదికలు సానుకూలంగా వచ్చాయి. టెలిఫోన్‌ విచారణలోనూ చాలా మంది సానుకూలంగానే చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించలేదు. ఔషధంపై ఆనందయ్య ఆయుర్వేద విభాగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది’’ అని రాములు వివరించారు.

ఆనందయ్య ఇంటి వద్ద బందోబస్తు

మరోవైపు, కృష్ణపట్నంలోని తన ఇంటికి ఆనందయ్య చేరుకున్నారు. ఈ నెల 21న ఔషధ పంపిణీ నిలిచిపోవడంతో వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్థులు వస్తున్నారు. దీంతో ఆనందయ్య ఇంటి వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నానికి రాకపోకలను నిలిపివేశారు.

ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఔషధంపై పరిశోధన జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత అందరికీ మందును అందుబాటులో ఉంచనున్నట్టు ఆనందయ్య చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS