కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. ముందుగానే ప్రకటించి అందరికీ మందు పంపిణీ చేస్తానని ఆయన వెల్లడించారు.
మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించిన విషయంతెలిసిందే. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని పేర్కొంది. అయితే, ఈనెల 29న ఆయుష్‌శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.