వచ్చే నాలుగు నెలల కాలానికి తమ ఉత్పత్తి ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన భారతీయ టీకా కంపెనీలు.- Asthram News

కొవిడ్‌-19 టీకా తగినంతగా అందుబాటులో లేదని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచడంపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు దృష్టి సారించాయి. వచ్చే నాలుగు నెలల కాలానికి తమ ఉత్పత్తి ప్రణాళికను ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. దీని ప్రకారం ఆగస్టు నాటికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 10 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ టీకా తయారు చేస్తుంది. అదేవిధంగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ 7.8 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారు చేయడానికి సిద్ధమవుతుంది. జులైలో 3.32 కోట్ల డోసులటీకా ఉత్పత్తి చేస్తామని, ఆగస్టు నాటికి దాన్ని 7.82 కోట్లకు పెంచుతామని భారత్‌ బయోటెక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.కృష్ణ మోహన్‌ ప్రభుత్వానికి నివేదించారు. సెప్టెంబరులోనూ అదే స్థాయి ఉత్పత్తి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి 10 కోట్ల డోసుల ‘కొవిషీల్డ్‌’ టీకా తయారు చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రకాష్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. టీకా ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, దీనివల్ల జూన్‌, జులై నెలల్లో ఉత్పత్తి కొంత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్స్‌ సంయుక్త కార్యదర్శి రజనీష్‌ టింగల్‌, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ మందీప్‌ భండారీ తదితరులతో కూడిన మంత్రివర్గ సంఘం ఈ ఏడాది ఏప్రిల్‌లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ టీకా తయారీ యూనిట్లను సందర్శించింది కూడా. ఇప్పుడు దేశీయంగా అవసరాలకు తగినట్లు కొవిడ్‌ టీకా లభించకపోవడంతో దిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా తదితర రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లు పిలవాలని నిర్ణయించడం తెలిసిందే. తమకు అదనపు డోసుల టీకా కావాలని దిల్లీ ప్రభుత్వం భారత్‌ బయోటెక్‌ను కోరింది. ముందు చెప్పినదానికి మించి ఇప్పుడు సరఫరా చేయలేమని కంపెనీ స్పష్టం చేసినట్లు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా తెలిపారు. టీకాల ఎగుమతిని నిలుపుదల చేయాలని, దేశీయంగా ఉత్పత్తి పెంచి సరఫరాలు పెంచాలని మనీష్‌ కోరారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS