కర్ణాటకలోని ఉడిపి, మంగళూరు, దక్షిణ కన్నడ, కేరళలోని కాసర్‌గడ్ తదితర ప్రాంతాలను తులునాడుగా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు తుళు అనే ద్రవిడియన్ భాషను మాట్లాడుతారు..
ఈ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన దేవుడు "కొరగజ్జ". ఎవరు కొత్త పని ప్రారంభించాలన్నా, ఎవరైనా తీవ్ర సమస్యంలో ఉన్నా ఈ దేవునికి మొక్కుకుంటే సమస్యలు తీరిపోతాయని ఇక్కడి స్థానికుల్లో బలమైన విశ్వాసం..
అంతేకాకుండా God Of Instant Justice, God Of Super Fast Judgement, God Of Punishment with 100% Accuracy అని ఖ్యాతి గాంచిన ఈ దేవుడు ఏవరో తెలుసుకుందాం..
ఎవరీ దేవుడు..
కొన్ని శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలోని "కొరగ" తెగలో ఒక బాలుడు జన్మించాడు. అతను పుట్టిన నెల రోజుల లోపే అతని తల్లి మృతిచెందారు. తండ్రి కూడా అనతికాలంలోనే కాలం చేశారు..
దీంతో ఆ బాలుణ్ణీ దురదృష్టవంతునిగా భావించి ఎవరూ దరిచేరనీయలేదు..
దీంతో అతను ఇళ్ళు, ఉన్న ఊరు వదలి వెళ్ళిపోయాడు..
ఎక్కెడెక్కడో తిరిగి "కల్లాపు" అనే ప్రాంతంలో ఒక వేపచెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేసుకోసాగాడు..
అప్పుడప్పుడూ ఇసుకను ఆహారంగా తీసుకునేవాడు.. అప్పుడప్పుడు బిగ్గరగా అరవడం, తనలో తాను మాట్లాడుకోవడం చేసేవాడు. బట్టలు ఉండేటివి కావు..
(ఇసుకను ఆహారంగా ఎలా తీసుకుంటారు అని అడగవచ్చు. 1998-99 ప్రాంతంలో అనంతపురం జిల్లా ఓబుళ దేవర చెరువు ODC లో ఓడీసీ బాబా అని ఒక అవధూత ఉండేవారు. ఆయన ఇసుక నోట్లో వేసుకుని మింగేయడం నేను స్వయంగా చూశాను)
ఒకరోజు బైరక్క అనే కల్లు అమ్ముకునే మహిళ తన ఇద్దరు పిల్లలతో అటుగా పోతూ, ఈ బాలుణ్ణి చూసింది. ఈ బాలుడు బిగ్గరగా అరుస్తూ సమీపంలోని గోడ చాటుకెళ్ళి దాక్కున్నాడు. ఆమె దయామయి కావడంతో ఎందుకు వెళ్ళి దాక్కున్నావు, ఎందుకు అరుస్తున్నావు ఇటురా అన్నది..
నాకు బట్టలు లేవు అని అతను చెబితే తన వద్ద ఉన్న బట్టలు ఇచ్చి కప్పుకోమన్నది. నీవు మా తోపాటు వస్తే నా ఇద్దరు పిల్లల మాదిరే నిన్ను కూడా మూడవ బిడ్డగా చూసుకుంటాను అని అతన్ని ఇంటికి రమ్మని ఒప్పించింది. అతను ఆమెతో వెళ్ళిపోయాడు..
ఆ బాలుడు ఇంట్లో అడుగు పెట్టగానే వారికి అదృష్టం కలిసొచ్చి సంపద విపరీతంగా పెరగసాగింది..
దీనితో బైరక్క కుటుంబానికి ఆ ఊరిలోని దేవాలయానికి ధర్మకర్తలుగా వ్యవహరించే భాగ్యం కూడా కలిగింది..
ఓసారి ఆ దేవాలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుండగా బైరక్క ఇంటి నుంచి దేవాలయానికి అలంకరణ/పూజాసామాగ్రి తీసుకుపోవడానికి చాలా మంది పని మనుషులు అవసరం ఏర్పడింది..
సమయం సమీపిస్తున్నా పనిమనుషులు కనిపించకపోవడంతో బైరక్క ఈ బాలుణ్ణి సహాయం చేయమనింది..
అప్పుడు ఆ బాలుడు ఈ పని చేయాలంటే ఏడుగురు మనుషులు కావాలి. కావున ఏడుగురు మనుషులు తినే అన్నం నాకు పెట్టించండి, తిన్న తరువాత ఆ పని చేస్తాను అన్నాడు. ఆ తల్లి అలాగే నాయనా అని సంతోషంగా అన్నం పెట్టించింది.. ఆ బాలుడు ఏడుగురు తినే అన్నం ఒక్కడే తిని ఆ సామాన్లన్నీ నెత్తిపై పెట్టుకుని "నేను నువ్వు పెట్టిన అన్నాన్ని తృప్తిగా తిని గుడికి వెళుతున్నాను. మళ్ళీ తిరిగి రాను." అన్నాడు. అదేంటి నాయనా అలా అంటావు అన్నది ఆ తల్లి. నేను నిజమే చెబుతున్నా నా మాటకు తిరుగు లేదు అంటూ ఆ బాలుడు ఆ సామాన్లు తీసుకుని గుడికి వెళ్ళాడు..
గుడి పూజారి అన్ని సామాన్లు ఆ ఒక్క బాలుడే ఎలా తెస్తున్నాడని ఆశ్చర్యపోయి సామాన్లు అక్కడ ఉంచి, గుడికి దూరంగా వెళ్ళమన్నాడు..
అప్పుడు ఆ బాలుడు నేనీ తెచ్చిన సామాన్లు కావాలి గాని,నేను మాత్రం దూరంగా వెళ్ళాలా అని అక్కడున్న అందరినీ అడిగాడు. కానీ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు..
గుడికి దూరంగా నిల్చుని ఉన్న ఆ బాలునికి గుడిపైకి వాలి పండ్లతో ఉన్న మామిడి చెట్టు కనిపించింది..
వెంటనే ఆ బాలుడు గుడి పైకెక్కి ఆ మామిడి కాయలు అందుకోబోయాడు. అందకపోవడంతో గర్భగుడిపై ఉన్న కలశం పై కాలుపెట్టి కాయలు కోస్తూ కిందపడిపోయాడు..
అందరూ వెళ్ళి ఆ బాలుని మృత దేహం కోసం వెతకసాగారు..
వారికి ఆ బాలుని మృతదేహం ఎంత వెదికినా కనపడలేదు..
గుడిని ప్రక్షాళన చేయాలని భావించి గర్భగుడిలో చూడగానే అంతవరకు ఉన్న దేవుని విగ్రహం స్థానంలో ఈ బాలుడు విగ్రహ రూపంలో వెలసి ఉన్నాడు..
దాంతో అందరూ ఆ దేవుడే ఈ బాలుని రూపంలో ఇన్నేళ్ళుగా తమ మధ్యలో నడయాడాడని కనువిప్పు కలిగి, బాలుణ్ణి కొరగజ్జ దేవునిగా పూజించడం ప్రారంభించారు.....!!
ఆ బాలుని పేరు "కరగ థానియా"
'కొరగ' అనగా ఈ తులునాడు ప్రాంతంలోని ఒక ప్రాచీన తెఖ పేరు..
'అజ్జ' అనగా ఆ తెగలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తికి ఇచ్చే గౌరవ నామం అని అర్ధం.. అంటే స్థూలంగా కొరగజ్జ అంటే కుల గురువు లేదా కుల దైవం అని పేరు. కొరగజ్జ అంటే తుళునాడు ప్రాంతంలో ఒక తెగ ప్రజలు ఆరాధించే కుల దైవం. క్రమంగా ఆ దేవుడు బాగా ప్రసిద్ధి చెంది, ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి దైవంగా మారిపోయాడు....!!