జలియన్ వాలాబాగ్ దురంతానికి నేటితో నూట రెండేళ్ళు. - Asthram News


జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి నేటికి 102 ఏళ్ళు గడిచాయి. మొదట ఆ దురంతం వివరాలు తెలుసుకుందాం…..

పంజాబ్ లోని అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన ప్రజలను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది. ఇక్కడ జరిగిన ఈ దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం అక్కడ 1951 లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ 6.5 ఎకరాల ఉద్యానవనం, సిక్కుల పవిత్ర పుణ్యకేత్రమైన స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉంది.

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. 1919 ఏప్రిల్ 13 న జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు  ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 మందికి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.

ఆ అమరులకు నా నివాళులు : ప్రధాని మోడీ
జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోడీ నివాళి అర్పించారు. వారు కనబరచిన అద్వితీయమైన ధైర్య సాహసాలు, త్యాగం ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయన్నారు. నేటితో ఆ నరమేధం జరిగి 102 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆయన ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జలియన్‌ వాలాబాగ్‌ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరపురాని చేదు జ్ఞాపకం : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ట్విటర్‌ వేదికగా జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరులకు నివాళి అర్పించారు. ‘అమరులకు నా నివాళులు. ఎన్నేళ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మెదులుతుంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది’ అని వెంకయ్య ట్వీట్‌ చేశారు..
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS