ఇండియన్ రాక్స్ చేతిలో అత్యంత అధునాతన గన్స్... Asthram News


సైనికుల చేతికి మరో పవర్ ఫుల్ గన్

దేశ ఉత్తర సరిహద్దుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన నెగెవ్‌ ఎన్‌జీ-7 అనే అధునాతన తేలికపాటి మర తుపాకులు (ఎల్‌ఎంజీ) వీరి చేతికి అందనున్నాయి. సైనికులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇన్సాస్‌ ఎల్‌ఎంజీ తుపాకుల స్థానంలో ఇవి ప్రవేశిస్తాయి.

ఎన్‌జీ-7 చాలా శక్తిమంతమైన తుపాకీ. ఇన్సాస్‌.. 5.56×45 ఎంఎం తూటాలను ప్రయోగిస్తుంది. ఎన్‌జీ-7 నుంచి మరింత శక్తిమంతమైన 7.62×51 ఎంఎం తూటాలు వెలువడతాయి. ఇన్సాస్ ‌కు తూటా అర (మ్యాగజైన్‌) ద్వారా బులెట్లను సరఫరా చేయాలి. అందువల్ల కాల్పుల సమయంలో ఈ అరలను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. అందుకు భిన్నంగా ఎన్‌జీ-7కు బెల్టులా తూటాలను అందించొచ్చు. ఫలితంగా ఇది అప్రతిహతంగా బులెట్ల వాన కురిపించగలదు. ఆటోమేటిక్‌ మోడ్ ‌లో ఉన్నప్పుడు ఏకంగా నిమిషానికి 700 తూటాలను ప్రయోగించగలదు.

ఇన్సాస్‌ ఎల్‌ఎంజీ రైఫిల్
వీటి ఖచ్చితత్వం కూడా ఎక్కువే. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలవు. ఈ తుపాకీ బరువు 7.5 కిలోలు. దీన్ని వాహనాలు, హెలికాప్టర్లు, యుద్ధనౌకలకూ అమర్చవచ్చు.

అత్యవసర కొనుగోలు ప్రక్రియ కింద ఎన్‌జీ-7 ఎల్‌ఎంజీలను భారత్‌ సమీకరించింది. ఈ ఏడాది జనవరిలో 6వేల తుపాకులు అందాయి. వీటిపై ఇప్పటివరకూ పలు పరీక్షలు జరిగాయి. సైన్యంలోని ఉత్తర విభాగం సైనికులను సోమవారం వీటిని అందిస్తారు.


పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ, చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద వీటిని ఉపయోగిస్తారు. రెండో విడత కింద 10వేల ఎన్‌జీ-7 తుపాకులు ఈ ఏడాది అక్టోబర్‌లో అందుతాయి. రూ.880 కోట్లతో 16,479 ఎల్‌ఎంజీలకు గత ఏడాది మార్చిలో భారత్‌ ఆర్డర్లు ఇచ్చింది. మరోవైపు ‘భారత్‌లో తయారీ’ కింద మరిన్ని ఎల్‌ఎంజీలను కొనుగోలు చేయాలని సైన్యం యోచిస్తోంది

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS