సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ. - Asthram News


సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ


గురూజీ అని పిలవబడే మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ ఆంగ్ల తేది 1906 ఫిబ్రవరి 19, మాఘ బహుళ ఏకాదశి నాడు సదాశివరావు , లక్ష్మిబాయి దంపతులకు జన్మించారు. వారిరువురిని భావూజీ, తాయీజీ అని పిలిచేవారు. మాధవ్ జననం వారి మేనమామ బాలకృష్ణ రాయ్ కర్ గారింట జరిగింది. సదాశివరావు గారు మొదటి నుండి పోస్టల్ విభాగంలో ఉద్యోగం చేశారు.

మాధవ్ ప్రాధమిక విద్య నాగపూర్ వద్ద నున్న రాయ్ పూర్ లో జరిగింది. మాధవ్ బాల్యంలో అడ్వంచర్ ఆఫ్ ఎ రూపీ అనే ప్రసిద్ధ ఆంగ్ల వ్యాసం వ్రాశారు. గురూజీ, తన అన్న అమృత్ రామలక్ష్మణులు వలె అన్యోన్యంగా ఉండే వారు. దురదృష్ట వశాత్తూ 1918 సంవత్సరంలో 15 సం|| వయస్సులో అమృత్ మరణించాడు.

చిన్ననాట వక్తృత్వ పోటీలలో పాల్గొన్నఅనుభవం వల్ల కామోసు పెద్దయ్యాక మాధవ్ భారత పర్యటనలో తన ప్రసంగాలలో ప్రజలను మంత్రముగ్ధులను చేసి ఆలోచింపచేయగల్గిన ప్రతిభకు అంకురార్పణ చేసినవి.

నాగపూర్లోని హిస్లాప్ కళాశాల లోమాధవ్ ఇంటర్మీడియట్ చదివారు. శ్రీ సావల్ రాం అనే అంధ వేణు గాన విద్వాంసుడి వద్ద మాధవ్ వేణుగానం అభ్యాసము చేసేవారు. కళాశాలలో ఒకసారి ప్రొఫెసర్ గార్డినర్ చెప్పిన బైబిల్ పాఠంలో మాధవుడు తప్పు పట్టడం జరుగుతుంది. తరువాత ప్రొఫెసర్ గార్డినర్ తనే పొరబాటు పడ్డానని తెలుసుకుంటారు.

మాధవ్ 1924లో కాశీ హిందు విశ్వవిద్యాలయంలో బి. ఎస్.సి లో చేరారు. తరువాత ఎమ్.ఎన్.సిలో మాధవ్ జీవ విజ్ఞాన శాస్త్రం అధ్యయన విషయంగా తీసుకుని చదివారు. యం.యస్.సి తరువాత మద్రాసు మత్స్య పరిశోధనాలయంలో పరిశోధన చేశారు.

గురూజీ చదువులపై మూడవ సర్ సంఘచాలక్ శ్రీ బాలా సాహెబ్ దేవరస్,”ఆయన టెక్స్ట్ పుస్తకాలు చదివారు. మేము గైడ్లు చదివాం. ఆయన విజ్ఞానం సంపాదించుకున్నారు. మేము మార్కులు సంపాదించుకున్నాం.” అని వ్యాఖ్యానించేవారు.

1930లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా శ్రీ గురూజీ చేరారు. అక్కడ గురూజీకి బాబూరావు (తాత్యారావ్)తెలంగ్ అనే కార్యకర్త సంఘకార్యం పరిచయం చేశారు. భయ్యా జీ దాణి ద్వారా డాక్టర్జీ గురూజీ గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత గురూజీ కాశీ శాఖ సంఘచాలక్ గా మొదట సంఘ బాధ్యత తీసుకుని పనిచేయడం ప్రారంభించారు.

1932 వ సంవత్సరములో నాగపూరు విజయదశమి ఉత్సవానికి గురూజీని మరియు ససద్గోపాల్ లనువిశిష్ట అతిథులుగ ఆహ్వనించారు డాక్టర్జీ.

1933 జూన్ లో గురూజీ కాశీ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగం విరమించారు. 1934 లోనాగ్ పూర్ తులసీ బాగ్ శాఖా కార్యవాహ బాధ్యత చేపట్టారు. తరువాత గురూజీ 1934లో,అకోలా శిక్షావర్గకు సర్వాధికారిగా ఉన్నారు. మనసు ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళడంతో

1936 అక్టోబర్ లో గురూజీ సారగాఛీలో రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులలో ఒకరయిన స్వామి అఖండానంద వద్దకు, అమితాబ్ మహరాజ్( స్వామి అమృతానంద) వద్ద రామకృష్ణాశ్రమం పరిచయ పత్రం తీసికొని వెళ్ళారు. 1936 జనవరి 13 మకర సంక్రాంతి పుష్య శుద్ధ పాడ్యమి రోజున స్వామి అఖండానంద గురూజీకి దీక్ష ఇచ్చారు.
గురూజీ ముఖ్య సామగ్రిలో స్వామిఅఖండానంద నుండి పొందిన వారి కమండలం జీవితాంతం ఉండిపోయింది.

సారగాఛీ నుండి వచ్చిన తర్వాత గురూజీ వివేకానంద చికాగో ఉపన్యాసాలను మరాఠీలోకి అనువదించారు శ్రీ గురూజీ.
సారగాఛీ నుండి వచ్చిన తరువాత గురూజీని డాక్టర్జీ వద్దకు తీసుకొని వెళ్ళవలసినదిగా గురూజీ మేనమామ రాయకర్, అమితాబ్ మహరాజ్ ని ఆదేశించారు.

1939 ఫిబ్రవరి సింధీ బైఠక్ ల తర్వాత గురూజీ సంఘ శాఖలు పెట్టడానికి 1939 మార్చిలోఉత్తర కలకత్తా వెళ్ళారు. 1939 రక్షా బంధన్ సమయంలో గురూజీ సర్ కార్యవాహగా నియుక్తులయ్యారు.

“సంఘంలో ఉంటూ స్వామి వివేకానంద పనినే ముందుకు నడిపిస్తానని నాకు విశ్వాసం ఉంది” ఇలా వివరిస్తున్న సమయంలో గురూజీ మెరుస్తున్న కండ్లలో వ్యక్తమైన ఆత్మ విశ్వాసాన్ని నేను ఎప్పటికి మరువలేదు. డాక్టర్జీ కూడా ఎంతో గంభీరమైన మానసిక స్థితి లోకి వెళ్ళిపోయారు” శ్రీ మాడ్ఖేల్కర్ వ్రాశారు.

“ఒక్క మాటలో చెప్పాలంటే గురూజీ నాకు తల్లి వలె సేవ చేశారు” అని డాక్టర్జీ అన్నారు. డాక్టర్ జీ 1940 జూన్ 21 ఉ 9-27 గంటలకు పరమపదించారు.

1940 జులై 3 సాయంత్రం సర్ సంఘచాలక్ గా గురూజీని ప్రకటించడం జరిగింది. సర్ సంఘచాలక్ గా గురూజీని ప్రకటించిన కార్యక్రమం కేంద్రీయ సంఘస్థాన్, రేషిమ్ బాగ్, నాగపూర్లో జరిగింది.



“ఇది విక్రమాదిత్యుని సింహాసనం. దీనిపై గొర్రెలు కాచే పసివాళ్లు ఉన్నప్పటికీ న్యాయం చేయగలరు” సర్ సంఘచాలక్ గా నియుక్తులవడంపై శ్రీ గురూజీ స్పందన ఇది . సర్ సంఘచాలక్ బాధ్యతకున్న మహత్యాన్ని వారు ఆ విధంగా వివరించారు.

క్రమక్రమంగా 1940 సంవత్సరంలో “గణవేషలోఖాకీ బదులు తెల్ల చొక్కా , సమతలో గణ, వాహిని, అనికినీ, ప్రదక్షిణ సంచలన్, ప్రత్యుత్ ప్రచలనం”క్రమంగ వాడుకలోకి వచ్చినవి.

1942లో వ్యవస్థితంగా ప్రప్రథమంగా ప్రచారక్ వ్యవస్థ ఏర్పడినది. ప్రచారక్ వ్యవస్థ ఏర్పడక ముందే శ్రీ బాబా సాహెబ్ ఆప్టే, శ్రీ దాదారావు పరమార్ధలు జీవితాన్ని సమర్పించి పనిచేసిన జ్యేష్ఠ కార్యకర్తలు . గృహస్థులైనప్పటికి బచరాజ్ వ్యాస్, శ్రీ బాబాసాహెబ్ భుస్కుటే ప్రచారకులుగా పనిచేశారు.

ప్రాముఖ్యత గల కొన్ని వివరాలు
జనవరి 30, 1948 నాడు గాంధీజీ హత్య జరిగింది. ఆ సమయంలో గురూజీ మద్రాసులో ఒక తేనీటి విందులో ఉన్నారు. మహాత్మాగాంధీ హత్యానంతరం సంతాప సూచకంగా 13 రోజులు సంఘకార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు గురూజీ ప్రకటించారు.

“ఆర్.యస్.యస్ శక్తివంతమైన సంఘటన. కాగితపు పులి కాదు. ఒక్క కలం పోటుతో నాశనమయ్యే సంస్థ అంత కంటే కాదు.” అని గురూజీ మద్రాసులో స్వయంసేవకులనుద్దేశించి అన్నారు.

గాంధీ హత్యానంతరం ఫిబ్రవరి 1వ తేది, 1948 శ్రీ గురూజీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 4, 1948 న ప్రభుత్వం సంఘంపై నిషేధపుటాజ్ఞలు జారీ చేసింది. ఆ సమయంలోభయ్యాజీ దాణే సర్ కార్యవాహగా ఉన్నారు.

సంఘంపై నిషేధం తొలగించటానికి శ్రీయుతులు కేత్కర్, టి.ఆర్ వెంకటరామశాస్త్రి, మౌళీ చంద్ర శర్మగారు ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం చేశారు. సంఘం యొక్క నియమావళి తయారీలోపండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ కీలక పాత్ర వహించారు.

సంఘంపై ప్రభుత్వం నిషేదం ఎత్తివేస్తున్నట్లు ఆలిండియా రేడియో జూలై 12, 1949వ తేదీన ప్రకటించింది. దరిమిలా గురూజీ జులై 13న విడుదలయ్యారు.

1952సంవత్సరంలో గోవధ నిషేధం కోసం సంతకాల సేకరణ చేయడం జరిగింది. 1962 సంవత్సరంలో వివేకానంద శిలాస్మారక నిర్మాణం జరిగింది.

1969లో బ్రహ్మకపాలంలో “స్వశ్రాద్ధవిధి” నిర్వహించుకొన్నారు. 1969 మరియు 70లలోగురూజీకి క్యాన్సరు సోకినట్లు అనుమానించడమైంది. క్యాన్సరు శస్త్రచికిత్స కోసం గురూజీ 26 రోజులు చికిత్సాలయంలో ఉండవలసి వచ్చింది.

1972 ఆగస్టు 20న దీనదయాళ్ శోధ్ సంస్థాన్ సామాజిక శ్రద్ధా కేంద్రం ప్రారంభింపబడినది. ఆఖరు సారిగా 1973 మార్చి 23 నుంచి 25 వరకుగురూజీ అఖిలభారత ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. అప్పటి ఆ మూడు రోజుల ప్రసంగాల సంపుటిని “విజయమే విజయం” అనే పేరుతో వెలువడింది. వారు తమ జీవితం అంతా ఇచ్చిన ఉపన్యాసాల సంపుటికి బంచ్ ఆఫ్ థాట్స్ అని పేరు వచ్చింది.

చివరి దశలో గురూజీ ఏప్రిల్ 2న మూడు ఉత్తరాలు ఉత్తరాలు వ్రాశారు. మొదటి ఉత్తర సారాంశం,తదుపరి సర్ సంఘచాలక్ నియామకం గురించి, మహారాష్ట్ర సంఘచాలక్ శ్రీ బాబురావు భిడే చదివారు.

తనకు స్మారకం నిర్మించవద్దని, తన శ్రాద్ధకర్మల విషయ వివరం రెండవ ఉత్తరం సారాంశం. మూడవ ఉత్తరంలో తన వలన ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నింప మన్న తుకారాము పలుకులు ఉటంకించారు.

గురూజీ మహాభినిష్క్రమణం జూన్ 5, 1973 రాత్రి 9.05ని.లకు. జరిగింది. గురూజీ అంతిమ సంస్కారం రేషింభాగ్ లోని , డాక్టర్జీ సమాధి ఎదురుగా జరిగింది.

తన ప్రసంగాలతో భారత జాతిని ఉర్రూతలూపిన శ్రీ గురూజీ, తన నడవడితో, తన కార్యశైలితో సంఘానికి అద్వితీయ రీతిలో పథ నిర్దేశం చేశారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సంఘ పథ నిర్దేశకులు పరమ పూజనీయ శ్రీ గురూజీ.

– దుర్భా శ్రీనివాస్, విజయవాడ 
సేకరణ VSK andhrapradesh

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS