ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలను పాటించటానికి దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్‌బుక్, గూగుల్‌లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వీటి అమలు దిశగా తమ కసరత్తు ఆరంభించామని పేర్కొన్నాయి. ఈ మధ్యకాలంలో కేంద్రంతో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్న ట్విటర్ మాత్రం మంగళవారం దాకా ఇంకా ఎలాంటి స్పందన తెలపకపోవటం గమనార్హం. దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య మండళ్ళు ఈ నిబంధనల అమలును ఏడాదిపాటు వాయిదా వేయాలని కోరినా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. బుధవారం నుంచి కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.
నిబంధనల అమలే లక్ష్యం: ఫేస్‌బుక్
సామాజిక వేదికలకు భారత ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయటమే తమ లక్ష్యమని... ఫేస్‌బుక్ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు... ప్రభుత్వ నిబంధనలను అమలు చేసే ప్రక్రియపై కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ‘‘నిబంధనలు అమలు చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. మా సామర్థ్యాలను మెరుగు పర్చుకుంటాం. అయితే... కొన్ని అంశాలపై మరింత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాం. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ భావాలు వ్యక్తంజేసుకునేందుకు వేదికగా నిలిచేందుకు మేం కట్టుబడి ఉంటాం’’ అని ఫేస్‌బుక్ పేర్కొనటం గమనార్హం! ఇంతకుమించి ప్రభుత్వ నిబంధనల అమలుకు ఏమేమి చర్యలు తీసుకున్నదీ ఫేస్‌బుక్ వివరించలేదు. మరోవైపు గూగుల్ నేరుగా చెప్పకుండా..‘‘మా కంపెనీ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి... ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ.. వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నాం’’ అని పేర్కొంది. మరోవైపు... ట్విటర్‌కు పోటీగా వచ్చిన కొత్త మాధ్యమానికి గతవారమే తాము భారత ప్రభుత్వం విధించిన నిబంధనలన్నీ పాటించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కూ-కు 60 లక్షల మంది వినియోగదారులున్నారు. దీంతో ఇది కూడా.. దిగ్గజ సామాజిక మాధ్యమంగా గుర్తింపు పొందింది.
పాటించకుంటే ఏమౌతుందంటే...
వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణకుగాను... కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలను ప్రకటించింది. అవన్నీ తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే... దిగ్గజ సామాజిక వేదిక(50 లక్షల రిజిస్టర్డ్ వినియోగదారులున్నవి... ట్విటర్, వాట్సప్, ఫేస్‌బుక్, గూగుల్, కూలాంటివి)లకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు మంగళవారంతో ముగిసింది. అంటే... బుధవారం నుంచి కొత్త నియమనిబంధనలు అమల్లోకి వస్తాయి. వాటికి ఈ సామాజిక మాధ్యమ వేదికలన్నీ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇన్నాళ్ళూ వాటికి రక్షణ కుఢ్యంగా నిలుస్తున్న ‘మధ్యవర్తి హోదా’ రద్దవుతుంది. అంటే... ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన సమాచారం పెడితే... దాన్ని తమ వేదికపై ప్రచారం చేసినా ఫేస్‌బుక్‌కు ఏమీ కాలేదు. పోస్టు పెట్టినవారిపై క్రిమినల్ లేదా ఇతరత్రా చర్యలకు ఆస్కారం ఉండేది. ఫేస్‌బుక్‌కు ఆ రక్షణ దొరకటానికి కారణం- మధ్యవర్తి హోదా! కానీ తాజాగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనలను అనుసరించకుంటే ఆ హోదాను ఫేస్‌బుక్ కోల్పోయి... క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది.
ఇవీ కొన్ని నిబంధనలు...
భారత్‌లో సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం... ఆయా సంస్థలు...
👉 దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా తెలియజేయాలి.
👉నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి.
👉 అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు... తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి.
👉దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని, పోస్టింగలను పెడితే... వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
👉ఎవరైనా వినియోగదారుల సందేశాలనుగానీ, వారి అకౌంట్లనుగానీ సామాజిక మాధ్యమం తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి తగిన సమయం కల్పించాలి.
👉సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వంలోని ఓ ఉన్నత స్థాయి కమిటీని పర్యవేక్షిస్తుంది.
మీయొక్క వార్తలను కాపీ చేసుకుంటా #samardha_News పేరు మీదనే wapp గ్రూపులో పోస్ట్ చేస్తా
ReplyDelete