అయ్యో.. ఆ మహమ్మారి మీద గెలవలేక ఆ ధీర యువతి గుండె ఆగిపోయింది..! - Asthram News

ముక్కుకు ఆక్సిజన్‌ పైపు.. చేతికి సెలైన్‌ ఉన్నా.. ఆసుపత్రి బెడ్‌ మీద పాటలు వింటూ ఆనందంగా కన్పించిన యువతి గుర్తుందా. గత వారం సోషల్‌మీడియాలో వైరల్‌ అయి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన ఆమె.. కరోనా ముందు ఓడిపోయింది. కొవిడ్‌పై చేసిన పోరాటంలో ఆ ధైర్యమైన గుండె ఆగిపోయింది. 

దిల్లీకి చెందిన డాక్టర్‌ మోనిక గతవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. కరోనా సోకిన ఓ యువతికి ఐసీయూ బెడ్‌ దొరక్కపోవడంతో సదరు ఆసుపత్రి సిబ్బంది కొవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. రెమ్‌డెసివిర్‌, ప్లాస్మాథెరపీతో పాటు ఎన్‌ఐవీ సపోర్ట్‌ అందించారు. సాధారణంగా అలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఎవరైనా భయపడతారు.. కుంగిపోతారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా కన్పించింది. పాటలు వినాలని ఉందంటే డాక్టర్లు అందుకు ఒప్పుకున్నారు. బెడ్‌పై ఫోన్లో ‘లవ్‌ యూ జిందగీ’ పాట వింటూ చిరునవ్వులు చిందించిన ఆమె వీడియోను డాక్టర్‌ మోనిక మే 8న పోస్ట్‌ చేయగా.. ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

అయితే నాలుగు రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఐసీయూలో చేర్చారు. ఈ విషయాన్ని డాక్టర్‌ మోనిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఆ ధైర్యమైన యువతి కోసం అందరూ ప్రార్థించండి. కొన్ని సార్లు మనం చాలా నిస్సహాయులమవుతాం. మన చేతుల్లో ఏమీ ఉండదు. అంతా భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రార్థనలేమీ ఫలించలేదు. చికిత్స పొందుతూ గురువారం ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ‘‘చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం’’ అని డాక్టర్‌ మోనిక నిన్న ట్విటర్‌ ద్వారా యువతి మరణవార్తను తెలియజేశారు. ఈ ట్వీట్‌ను చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘‘గుండె పగిలే వార్త ఇది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’’ అంటూ బాధాకర పోస్ట్‌లు పెడుతున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS