భారత నౌకాదళం చేతికి మరో కీలక అస్త్రం అందింది. ప్రాజెక్టు-75లో భాగంగా చేపట్టిన ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ముంబయిలో ఉన్నతాధికారుల సమక్షంలో దీనిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్, విశ్రాంత అడ్మిరల్ వీఎస్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సంరద్భంగా నేవీ చీఫ్ మాట్లాడుతూ.. ”భారత నౌకాదళ వృద్ధికి దేశీయ తయారీ పునాది వంటిందన్నారు. ప్రస్తుతం తయారీలో వివిధ దశల్లో ఉన్న 42 నౌకలు, సబ్‌మెరైన్లలో 40 పూర్తిగా భారత్‌లోనే తయారవుతున్నాయి” అని తెలిపారు.
రెండేళ్లు కఠిన పరీక్షలు పూర్తిచేసి..
ఐఎన్‌ఎస్ కరంజ్‌ను 2018లోనే నిర్మించారు. కానీ, దీనిని అప్పటి నుంచి సముద్ర జలాల్లో ఉంచి వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రాజెక్టు 75 కింద చేపట్టిన ఆరు సబ్‌మెరైన్లలో ఇది మూడోది. అంతకుముందు ఐఎన్‌ఎస్ కల్వరి, ఐఎన్‌ఎస్ ఖండేరీలను నౌకా దళానికి అప్పజెప్పారు.
2006లో ఆరు స్కార్పియన్ శ్రేణి సబ్‌మెరైన్లను భారత్‌లో నిర్మించేందుకు ఫ్రాన్స్‌లోని నేవల్ గ్రూప్‌తో మజగావ్ డాక్ లిమిటెడ్‌కు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు విలువ 3.75 బిలియన్ డాలర్లు. దీనికి ప్రాజెక్టు 75 అనే పేరుపెట్టారు. వాస్తవానికి 2020లో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యాలు చోటు చేసుకొన్నాయి.
1980లో భారత్ వద్ద 21 సబ్‌మెరైన్లు ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 15కు పడిపోయింది. వీటిల్లో ఎప్పుడూ 8మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరోపక్క చైనా అన్ని రకాల సబ్‌మెరైన్లు కలిపి దాదాపు 65 వరకు వాడుతోంది.