నేటికి సరిగ్గా వందేళ్లు ఆనాటి "చౌరి చౌరా" ఘటన జరిగి
ఆనాడు ఎం జరిగిందో తెలుసుకుందాం....
1920 ల ప్రారంభంలో, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారతీయులు దేశవ్యాప్త సహాయ నిరాకరణోద్యమంలో నిమగ్నమయ్యారు. స్వరాజ్యం లేదా భారత స్వాతంత్ర్యం అనే అంతిమ లక్ష్యంతో, రౌలాట్ చట్టం వంటి అణచివేత విధానాలతో కూడిన ప్రభుత్వ నియంత్రణ చర్యలను సవాలు చేస్తూ, భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసనలు అహింసా పద్ధతులలో చెయ్యాలని పిలుపునిచ్చారు.
ఉద్యమం తారాస్థాయిలో జరుగుతున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 5న ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న స్వాతంత్ర్య ఉద్యమ కారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సహాయనిరాకరణ ఉద్యమాన్ని ఆపివేశారు.
ఈ హత్యలకు ప్రతిస్పందనగా, బ్రిటిష్ అధికారులు చౌరి చౌరా, పరిసరాల్లో సైనిక శాసనన్ని ప్రకటించారు. పదుల మందిని చంపారు. అనేక దాడులు చేశారు. వందలాది మందిని అరెస్టు చేశారు. దాంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ఈ ప్రజాగ్రహాన్ని చూసి భయపడిన గాంధీ రక్తపాతం జరగడం తన అపరాధంగా భావించి ఐదు రోజులు ఉపవాస దీక్ష చేపట్టాడు. దాడిని ఎదుర్కోవడంలోను, సంయమనం పాటించటానికి ప్రజలకు తగిన విధంగా సర్ది చెప్పడంలో విఫలం అయ్యానని, దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఆపివేశారు. తర్వాత గాంధీని కూడా అరెస్టు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ తరువాత అనారోగ్య కారణంగా ఫిబ్రవరి 1924 లో ఆయనను విడుదల చేశారు.
చౌరి చౌరా వ్యవహారంతో సంబంధమున్నట్లు భావించి, "అల్లర్లు, కాల్పులు" ఆరోపణలపై మొత్తం 228 మందిని అరెస్ట్ చేసి విచారణకు తీసుకువచ్చారు. వీరిలో 6 మంది పోలీసు కస్టడీలో ఉండగా మరణించారు. ఎనిమిది నెలల పాటు జరిగిన విచారణలో దోషులుగా నిర్థారింపబడిన 172 మందికి ఉరిశిక్ష విధించారు.
ఈ తీర్పులపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో నిరసన తుఫాను చెలరేగింది. తీవ్ర నిరసనల నేపధ్యంలో అలహాబాద్ హైకోర్టు 20 ఏప్రిల్ 1923న తీర్పులను సమీక్షించి, 19 మందికి మరణశిక్షలను ఖరారు చేసి మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ఆనాడు అమరులైన భరతమాత ముద్దు బిడ్డలకు
శతకోటి నమోవాకాలు.
జైహింద్